సోషలిజం తోనే సామాజిక న్యాయం

🚩సోషలిజంతోనే సామాజిక న్యాయం🚩

— వి.శ్రీనివాసరావు

నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం

ఐక్యరాజ్యసమితి పిలుపుపై ఫిబ్రవరి 20న అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రపంచమంతా పాటిస్తున్నారు.

భారతదేశానికి దీని ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది.

గత 35 సంవత్సరాలుగా అమలవుతున్న ఆర్థిక సంస్కరణలతో అన్ని రంగాల్లో అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. సంపద కేంద్రీకరణ పెరిగింది.

ఆర్థిక అసమానతలతో పాటు ప్రాంతీయ, సామాజిక, లింగ అసమానతలు కూడా ఎక్కువయ్యాయి.

సంపద పెరిగితే అదే కిందకు వచ్చి అందరికీ ఫలాలు అందిస్తుందని పాలకులు పెట్టిన భ్రమలు పటాపంచలయ్యాయి.

21వ శతాబ్దం ఆరంభంలో ఉన్న ఆర్థిక వేగం ఇప్పుడు బాగా మందగించింది. సోషలిజం ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేసి ఆదర్శంగా నిలబడ్డ సోవియట్‌ యూనియన్‌ దెబ్బ తినడం, అమెరికా పెత్తందారీతనానికి, ఏకఛత్రాధిపత్యానికి ఎదురు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సామాజిక వనరులను దోపిడీ చేసి…ఆఖరికి పర్యావరణానికి సైతం ముప్పు తెచ్చి పెట్టారు.

ఈ కాలంలో బిజెపి వంటి అభివృద్ధి నిరోధక శక్తులు విజృంభించాయి. పురోగామి శక్తులు ప్రత్యేకించి కార్మిక, కర్షక ఉద్యమాలు,వామపక్ష పార్టీలు బలహీన పడ్డాయి.

బడా కార్పొరేట్‌ కంపెనీలు శ్రామికుల పీక మీద కత్తిపెట్టి పని చేయించుకుంటున్నాయి.దానికి చట్టబద్దత కల్పించడం కోసమే లేబర్‌ కోడ్స్‌ రుద్దారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచారు.

గత ఐదారు మాసాలుగా ప్రజలపై సాగుతున్న ఈ వరుస దాడుల వెనుక పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం దాగి ఉంది. 2026లో సమస్యలకు సమాధానం చెప్పలేక విజన్‌ 2047 అంటూ ఊరిస్తున్నారు.

➡️సంపద కేంద్రీకరణతో అసమానతలు

ఈ అసమానతలకు కారణం పెట్టుబడిదారీ దోపిడీనే. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద పెరిగిన మాట వాస్తవమే. కాని ఆ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడుతుంది.

అత్యధికులు అప్పులపాలవుతున్నారు.అప్పులు తీర్చడానికే పని చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. మధ్యతరగతి, అంతకు దిగువనున్న కోట్లాదిమంది శ్రామికుల ఆదాయాలు పడిపోతున్నాయి. వారి కొనుగోలు శక్తి తగ్గుతుంది.

సరుకులు అమ్ముడు పోవు.కొత్త మార్కెట్ల కోసం పెట్టుబడిదారుల మధ్య కుత్తుకలు కోసుకునే పోటీ ఆరంభమవుతుంది. అదిప్పుడు మనం చూస్తున్నాం.

కార్ల్‌ మార్క్స్‌ పరిశోధించి చెప్పిన మాటల అర్ధం ఏమిటో ఇప్పుడు సులభంగా అర్ధం చేసుకోగలం. పాతికేళ్ల క్రితం ఈ మాటలు చెప్తే ఎగతాళి చేశారు. ఇప్పుడు వారే ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం కళ్లకు కట్టినట్లు నేడు కనిపిస్తున్నది. నాడు కమ్యూనిజం ఎక్కడ అని ప్రశ్నించిన మధ్యతరగతి బుద్ధిజీవులు ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతూ నిలదొక్కుకోవడానికి గడ్డిపోచ దొరికినా చాలనుకుంటున్నారు.

నాడు ఐటి ఉద్యోగాలు వస్తే ఇయంఐ లు కట్టుకుంటూ అన్ని రకాల సౌకర్యాలు పొందవచ్చని ఆత్మవిశ్వాసంతో ఉన్న జంటలు నేడు ఇంట్లో ఒకరికి ఉద్యోగం పోయినా ఎలా బతకాలో, ఇయంఐలు ఎలా కట్టుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు.

దానికి తోడు హెచ్‌ 1 బి వీసాల వేధింపులతో అమెరికా జీవితం ఒక పీడకలగా మారుతుందేమోనన్న భయ సందేహాలతో బతుకుతున్నారు.

నాడు స్వర్గంలా కనిపించిన అమెరికాలోనే నేడు సోషలిస్టు నినాదాలు వినిపిస్తున్నాయి.ట్రంప్‌ లాంటి పాలకులు సోషలిజం పేరు వింటే ఉలిక్కి పడుతున్నారు.

ఒక ప్రజాస్వామ్య సోషలిస్టునని చెప్పుకొని మమ్దానీ న్యూయార్క్‌ మేయర్‌గా విజయం సాధించడం పెట్టుబడిదారీ సంస్కర్తలకు మింగుడుపడటం లేదు.

20వ శతాబ్దం ఆఖరులో ఆరంభమైన ఆర్థిక సంస్కరణలకు తిరుగులేదని విర్రవీగిన వారు ఇప్పుడవే సంస్కరణలు అభివృద్ధికి ఆటంకంగా మారి తిరోముఖం పట్టడం భరించలేకపోతున్నారు.

అత్యంత బలమైన శక్తిగా ఉన్న అమెరికా ప్రపంచాన్ని జయించాలనుకొని సాధ్యం కాక ఇప్పుడు భయపెట్టి బతకాలనుకుంటోంది. తనను తాను కాపాడుకోడానికి రక్షణ చర్యలు (ప్రొటెక్షనిజం) తీసుకుంటున్నది.

➡️టెక్నాలజీపై కార్పొరేట్‌ ఆధిపత్యం

సామాజిక అభివృద్ధికి పునాదిగా ఉండాల్సిన టెక్నాలజీ కార్పొరేట్‌ దోపిడీకి సాధనంగా మారింది. ఏ టెక్నాలజీ అండ చూసుకొని అమెరికా విర్రవీగిందో అదే టెక్నాలజీ వారి చేయి జారిపోతున్నది.

టెక్నాలజీపై ఆధిపత్యం కోసం పేటెంట్‌ హక్కుల్ని పొందాననుకొంటున్న అమెరికా అదే పేటెంట్‌ టెక్నాలజీ పురోగతికి ఆటంకంగా మారింది.

మన లాంటి దేశాల నుండి మేధస్సును చౌకగా తన్నుకు పోయిన (బ్రెయిన్‌ డ్రెయిన్‌) అమెరికా నేడు తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి మన మేధస్సును తరిమికొట్టాలని చూస్తున్నది.

అమెరికాలో అధిక వేతనాలిచ్చి మేధస్సును కొనుక్కునే కన్నా ఇండియాలోనే ఇన్నొవేషన్‌ హబ్‌లు పెట్టి చౌకగా మేధస్సును కొనుగోలు చేసి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్నాయి.

హబ్‌లతో పాటు పబ్‌ కల్చర్‌ కూడా దిగుమతి అయింది. డ్రగ్స్‌తో యువత మత్తులో కూరుకుపోతున్నది.

కార్పొరేట్లు 21వ శతాబ్దపు ఆస్తిగా భావిస్తున్న యువత నేడు మత్తులో జోగడం దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నది. అన్ని వ్యాపారాల కన్నా డ్రగ్స్‌ వ్యాపారమే మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్నది. పాలకుల విధానాలకు పరాకాష్ట ఇది.

సామాజిక అభివృద్ధికి టెక్నాలజీ చాలా అవసరం. టెక్నాలజీ స్వేచ్ఛగా అభివృద్ధి కావడానికి పెట్టుబడిదారీ వ్యవస్థే ఆటంకంగా మారిందని ప్రస్తుత పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

అంతర్జాతీయ కంపెనీల ప్రయోజనాలకు మన పాలకుల ప్రయోజనాలు కలిశాయి.వచ్చిందే అవకాశం అనుకుంటూ వారికి హారతులిచ్చి రెడ్‌ కార్పెట్‌ పరిచి స్వాగతం చెప్తున్నారు.

ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాని దీని వల్ల మనకు ఆధునిక టెక్నాలజీ మార్పిడి జరగదు. దానిపై వారి ఆధిపత్యమే కొనసాగుతుంది. మనకు వచ్చేది భరించలేని పొల్యూషన్‌ మాత్రమే. అభివృద్ధి చెందిన దేశాల చెత్తకు మనం అడ్డాగా మారుతున్నాం.

➡️ప్రైవేటీకరణతో సామాజిక అన్యాయం

1991 నుండి ఒక పథకం ప్రకారమే ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో కార్మికుల ప్రతిఘటన ఫలితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆగింది. అయినా కుట్రలు సాగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వ రంగం వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి దోహదపడింది. హైదరాబాద్‌,విశాఖ వంటి నగరాల పురోగతిలో ప్రభుత్వ రంగ వ్యాప్తే ప్రధాన కారణం.

ముందుగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో అమలవడం వల్ల దళితులు, ఆదివాసీలు, మహిళలు, వికలాంగులు తదితర బలహీన తరగతులకు మేలు జరిగింది.

విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి.ఆత్మ విశ్వాసం పెరిగింది. ప్రైవేటీకరణ ఫలితంగా డబ్బులున్న సంపదపరులకే నాణ్యమెనౖ విద్య దొరుకుతుంది. మార్కులు రాకున్నా ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తున్నారు.

గ్రామాల్లో దళితుల పేటల్లో,బిసి కాలనీల్లో నిరుద్యోగ యువత పెరుగుతోంది.లేబర్‌ మార్కెట్‌లో వేతనాలు పడిపోతున్నాయి. శ్రమకు గౌరవం తగ్గింది. పెట్టుబడికి పెద్దపీట వేస్తున్నారు.

➡️టెక్నాలజీలో ఎందుకు వెనుకబడుతున్నాం?

ఎ.ఐ గ్లోబల్‌ సదస్సు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచంలోనే ఇది మొదటిదని మోడీ ఘనంగా ప్రకటించిన మరు క్షణమే మన ప్రతిష్ట ఢిల్లీలో మంటగలిసింది.

గల్గోటియాస్‌ అనే ప్రైవేటు యూనివర్శిటీ వారు ఆ ఎగ్జిబిషన్‌లో ఒక ఎ.ఐ ఆధారిత రోబో కుక్కను ప్రదర్శించారు. చప్పట్లు చాలించక ముందే ఆ కుక్క మనది కాదు చైనా నుండి అరువుకు తెచ్చుకున్నదని తెలియడంతో మన పాలకులకు నోట మాట రాలేదు. వెంటనే గల్గోటియాస్‌ను ఎగ్జిబిషన్‌ నుండి బహిష్కరించి పరువు కాపాడుకున్నారు.

ప్రైవేటు కంపెనీలు ఇలాంటి ట్రిక్కులతోనే కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుండి కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వ రంగాన్ని వారికి బలిస్తున్నారు.

అదే ఎ.ఐ గ్లోబల్‌ సదస్సులో అంతర్జాతీయ ఒప్పందాలన్నీ మన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఐటీ లతోనే జరిగాయన్న కఠిన వాస్తవాన్ని మరవకూడదు.

మనం పెద్దఎత్తున రాయితీలిచ్చి నెలకొల్పిన ప్రైవేటు విద్యాసంస్థలేవీ ఈ జాబితాలో లేకపోవడం గత 35 సంవత్సరాల ప్రభుత్వ విధానాల వైఫల్యం కాక మరేమిటి?

పౌర విమానయానం,టెలికం,మెట్రో వంటి అనేక రంగాల్లో ప్రైవేటు కంపెనీల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

హైదరాబాద్‌లో ఎల్‌ అండ్‌ టి నిర్వహిస్తున్న మెట్రో కొద్ది రోజుల్లో ప్రభుత్వపరం కాబోతున్న వాస్తవం దీన్నే తెలియచేస్తున్నది.

చైనా సాంకేతిక విప్లవంతో గూగుల్‌,మైక్రోసాఫ్ట్‌,మెటా వంటి బడా గ్లోబల్‌ కంపెనీలు షేక్‌ అవుతుంటే చివరకు మోడీ ప్రభుత్వం భారతీయ కార్పొరేట్లను కాపాడటానికి చైనా నుండి పెట్టుబడులకు ద్వారాలు తెరవాల్సి వస్తున్నది.

➡️సోషలిజమే టెక్నాలజీకి భవిష్యత్తు

శాస్త్ర, సాంకేతిక రంగంలో మనం ఎందుకు వెనకబడ్డామో విద్యావంతులు ఒక్కసారి ఆలోచించాలి. దేశ ప్రయోజనాల కన్నా కార్పొరేట్‌ లాభాలకు పెద్ద పీట వేయడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది.

అదే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే.దాని స్పీడు ఇప్పుడు మాటల్లోనే కనిపిస్తున్నది తప్ప ఆచరణ గడప దాటడం లేదు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి సామాజికాభివృద్ధికి తోడ్పడితే అసమానతలు తగ్గుతాయి.

అదే కార్పొరేట్‌ లాభాలకు తోడ్పడితే అసమానతలు తీవ్రతరమై సమాజం సంక్షోభంలో కూరుకుపోతుంది. నేడదే జరుగుతోంది. అందుకే నేడు యువతరం ఎదుర్కొనే సమస్యలకు ఈ వ్యవస్థ పరిష్కారం చూపించలేకపోతోంది.

యువతరంలో అసంతృప్తి పెరుగుతోంది.దాన్ని పక్కదారి పట్టించడానికే కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని వెదజల్లుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే బాగుందనుకుంటోంది.

అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం కూడా లౌకిక భావాలను పక్కనపెట్టి ఆర్‌.యస్‌.యస్‌ భావజాలానికి అంటకాగుతోంది. చివరకదే వారి పాలిట యమపాశమవుతుందని అనేక రాష్ట్రాల అనుభవం చెపుతోంది.

ఇప్పటికైనా మారుతున్న కాలానికనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మారాలి. 20వ శతాబ్దపు ఆఖరి ఘడియల్లోని కాలం చెల్లిన భావజాలం భ్రమల్లో బతుకుతున్న యువతరం కళ్లు తెరవాలి.

అసమానతల్లేని సమాజం కోసం పోరాడటానికి ముందుకు రావాలి. ఆర్థిక అసమానతలే కాదు అంబేద్కర్‌ కలలు కన్న కుల నిర్మూలన, ఫూలే దంపతులు, కందుకూరి వంటి సంస్కర్తలు పోరాడిన లింగ సమానత్వం కూడా సోషలిజం లోనే సాధ్యమన్న సత్యాన్ని గ్రహించాలి. శ్రీశ్రీ అన్నట్లుగా యువతరం నవోదయానికి నాంది పలకాలి.

వ్యాసకర్త:-

వి. వి.శ్రీనివాసరావు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్.

Latest articles

మాతా అన్నపూర్ణేశ్వరి..ll

మాతా అన్నపూర్ణేశ్వరీ.............!! 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం...

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతికుమార్ రెండోసారి ఎంపిక

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్* జనతా వార్  ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు...

హైదరాబాదులో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల 10...

అమెరికా సుప్రీంకోర్టు సంచన తీర్పు

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ట్రంప్‌ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు-సుప్రీం ఇప్పటి వరకు వివిధ...

More like this

మాతా అన్నపూర్ణేశ్వరి..ll

మాతా అన్నపూర్ణేశ్వరీ.............!! 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం...

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతికుమార్ రెండోసారి ఎంపిక

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్* జనతా వార్  ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు...

హైదరాబాదులో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల 10...