janatawar.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 4:13 pm Editor : Admin

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5

కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి

భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి

కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్, యూఎల్‌సీ భూములను రక్షించాలి

సిపిఐ నాయకులు పనుగంటి పర్వతాలు,

శేరిలింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలో అసైన్డ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) భూములపై భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టి, సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

1961 నాటి చట్టాల ప్రకారం ఎస్సీ, బీసీ, మైనారిటీ పేద కుటుంబాలకు కేటాయించిన అసైన్డ్ భూములు నేడు భూ మాఫియా చేతుల్లోకి వెళ్లడం అత్యంత దురదృష్టకరమన్నారు. కానామెట్ గ్రామంలోని సర్వే నంబర్లు 41/2, 41/5, 41/7, 41/3, 41/11/A, 60, 46, 64, 58, 50, 59, 43, 45తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారంలో అమర్నాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కొంతమంది రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరిస్తూ, భారీ ఆర్థిక లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

సాధారణ పేద ప్రజలకు మాత్రం పీఓటీ చట్టం కింద నోటీసులు జారీ చేస్తూ, ప్రభావశీలులైన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలని, పెద్దలకు ఒక న్యాయం – పేదలకు మరో న్యాయం అనే విధానాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

అమర్నాథ్ రెడ్డి కార్యకలాపాలు కేవలం కానామెట్‌కే పరిమితం కాకుండా గండిపేట, గోపనపల్లి తదితర ప్రాంతాలకు కూడా విస్తరించాయని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

ఈ భూ అక్రమాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు, అక్రమ ఆస్తుల సృష్టి జరిగిన అనుమానాలు ఉన్నందున ఆదాయపు పన్ను శాఖ (ఇన్‌కమ్ టాక్స్), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర సంస్థలతో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కానామెట్‌లో ప్రభుత్వ భూములను కాపాడాలని, ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. కే చందు యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి

కే వెంకటస్వామి సిపిఐ జిల్లా సమితి సభ్యులు. టి రాములు ఏఐటియుసి అధ్యక్షులు జెట్టి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు