జనతా వార్ ర్మికుల రక్తం పీల్చేందుకే లేబర్ కోడ్లు*
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య హెచ్చరిక*
మోడీ ప్రభుత్వం కార్మిక ద్రోహం చేస్తోంది-వనంపల్లి జైపాల్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి*
శ్రమ దోపిడీకి చట్టబద్ధత కల్పించేందుకే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్మికుల ఉద్యోగ భద్రతను హరించి, యజమానుల ఇష్టారాజ్యానికి తలుపులు తెరవడమే లేబర్ కోడ్ల అసలు ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ చౌరస్తాలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లేబర్ కోడ్ల రద్దు కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఓరుగంటి యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు రక్తం కార్చి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికులను నిర్బంధిత బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత పూర్తిగా లేకుండా పోతుందని, జీతాల పెంపు, పని గంటల పరిమితి, హక్కుల రక్షణ అన్నీ గాలికొదిలేసినట్లేనని అన్నారు. ఇవి ఆర్థిక నేరగాళ్లకు, పెద్ద కార్పొరేట్ సంస్థలకు లాభపడేలా రూపొందించారని, దీని వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతుందని హెచ్చరించారు.రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యాపారాల్లోకి దిగిన తర్వాతే కార్మిక వ్యతిరేక చట్టాలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు.లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసే వరకు కార్మిక ఉద్యమం ఆగదని, అవసరమైతే మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులంతా ఏకమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది కార్మికులకు లేబర్ కోడ్లు శాపంగా మారుతున్నాయని అన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి ముందు, తర్వాత సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం అంటే స్వాతంత్ర్య సమరయోధులను అవమానపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగటిత, అసంఘటిత రంగాల కార్మికులంతా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నర్రగిరి, వినయ్ యుగంధర్ రెడ్డి, జగన్, సురేష్, జాస్వ, పెంటయ్య, రమేష్, ఆనంద్, బాల్ రాజ్, నరేందర్, నరసింహ, బాబు, సత్యం, మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.